05-11-2025 04:16:14 PM
విశిష్టత కలిగిన కార్తిక పున్నమి
శివాలయాల్లో భక్తుల రద్దీ
మంథని,(విజయక్రాంతి): కార్తీక మాసంలో ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమితికి రోజు బుధవారం మంథని పట్టణంలోని శివాలయాలు భక్తుల రాకతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలోని శ్రీ ఓంకారేశ్వరాలయం, శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయం, శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి ఆలయం, గోదావరి నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.
కార్తీక మాసం విశిష్టత
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఒక విశిష్టమైన పర్వదినం. ఆధ్యాత్మిక వేత్తలకు, భక్తులకు ఆనందాన్ని పంచి ఇచ్చే పండుగ కార్తిక పౌర్ణమి. తెల్లని వెన్నెల రాత్రులకు పేరెన్నికగన్న కార్తికం శరత్కాలం నింగికి నేలకు శోభను చేకూరుస్తుంది'. వానాకాలంలో దేవలోకాలకు తరలిపోయిన రాజహంసలు శరత్కాలం రాగానే క్రౌంచ పర్వత రంధ్రం ద్వారా తిరిగి భూలోకానికి వస్తాయని శాస్త్రాలు చెప్పబడింది.
ఆధ్యాత్మిక పరులకు కార్తీక పౌర్ణమి ఆనందదాయకం. దానికి అనువైన రోజు కార్తిక పున్నమి. కార్తీక మాసాన్ని వెన్నెల మాసం అని అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత- అనే పదహారు కళలతో నిండుగా వెలిగే పున్నమి చంద్రుడి అతిలోక సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలంటే కార్తిక పౌర్ణమిని మించిన రోజు లేదని శాస్త్ర ప్రవచనము.