కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసేవి జిమ్మిక్కులే
కేసీఆర్ ప్రసంగాలకు ప్రజలు నవ్వుతున్నారు
రేవంత్, రాహుల్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవట్లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 9( విజయక్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల జిమ్కిక్కులు చేస్తూ బట్టకాల్చి మీద వేసే ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ప్రధానమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని నవ్వుకుంటున్నారన్నారు.
గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అవుతుందని, దాని గురించి తెలంగాణ ప్రజలెవరూ కూడా పట్టించుకోవడం లేదన్నారు. హైకమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ప్రజలను కలిసినట్లు తెలిపారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసినా బీజేపీ విజయానికి ఎటువంటి ఢోకా లేదన్నారు. అండర్ కరెంట్ ఓపెన్ అయ్యిందని, ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభ చాలా కీలకమైందని, దీనిలో 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు పాల్గొంటారన్నారు.
మోదీకి మనమంతా అండగా నిలవాల్సి ఉందని, ఏ ఫ్రంట్ కూడా మోదీకి ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి విమర్శించేందుకు ఏమీ లేదని అందుకే దష్ప్రచారాలు చేస్తోందని, అందులో భాగంగానే రిజర్వేషన్లపై చెడు ప్రచారం చేసిందన్నారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మాటలను ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.






