calender_icon.png 29 August, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల ఎఫెక్ట్..

29-08-2025 05:38:35 AM

  1. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
  2. పలు రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు ఇంకొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భారీ వర్షాలతో పట్టాలపై వరద ప్రవాహం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు.

సికింద్రాబాద్- కామారెడ్డి మార్గంలో బిక్కనూరు-తల్మడ, అక్కన్నపేట-మెదక్ సెక్షన్‌లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు చేరడంతో ఆ మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పాక్షిక రద్దు తదితర వివరాలను తెలియచేసేందుకు కాచిగూడ, సికింద్రాబాద్, నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు.

రద్దు చేసిన రైళ్లు

మెదక్-కాచిగూడ, కాచిగూడ-మెదక్, కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి, నిజామాబాద్-కాచిగూడ, కాచిగూడ-నాగర్‌సోల్, నాందేడ్-మేడ్చల్, నాగర్‌సోల్-కాచిగూడ వెళ్లాల్సిన రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. బోధన్-మహబూబ్‌నగర్-కాచిగూడ రైలును పాక్షికంగా రద్దు చేశారు.

పలు రైళ్ల దారి మళ్లింపు

రాయచూరుపర్బనీ రైలును వికారాబాద్-పర్లీ వైద్యనాథ్ మీదుగా, నాందేడ్-రాయచూరు రైలును పూర్ణా-పర్లీ వైద్యనాథ్, వికారాబాద్ మీదుగా, బికనీర్-కాచిగూడ రైలును పూర్ణ, పర్బనీ, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా, హిస్సార్-హైదరాబాద్ రైలును పర్బనీ, వికారాబాద్ మీదుగా, మన్మాడ్-కాచిగూడ అజంతా ఎక్స్‌ప్రెస్‌ను కూడా పర్బనీ, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు. నర్సాపూర్-నాగర్‌సోల్ రైలును చర్లపల్లి, సికింద్రాబాద్, వికారాబాద్, పర్బనీ మీదుగా దారి మళ్లించారు. 

రీషెడ్యూల్

గురువారం కాచిగూడ-భగత్‌కి కోఠి (జోధ్‌పూర్), కాచిగూడ-నార్‌ఖెర్ వెళ్లాల్సిన రైళ్లను శుక్రవారానికి రీషెడ్యూల్ చేశారు. 

పాక్షికంగా రద్దు

భద్రాచలం-బలార్షా రైలును కాజిపేట మధ్య, సిర్పూర్ టౌన్-భద్రాచలం రైలును సిర్పూర్ టౌన్-కాజిపేట మధ్య, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలును కాజిపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ రైలును సిర్పూర్ కాగజ్ నగర్-కాజీపేట మధ్య, గుంతకల్- బోధన్ రైలును కాచిగూడ-బోధన్ మధ్య, కాచిగూడ-మెదక్ రైలును మేడ్చల్-మెదక్ మధ్య రద్దు చేశారు.