పైన పటారం.. లోన లోటారం!
తొలకరి వర్షానికే అస్తవ్యస్తమైన ఏటీసీ
ఏటీసీ కేంద్రంలోకి చేరిన వర్షపు నీరు
పడిపోయిన ఫాల్ సీలింగ్
తడిసిన కంప్యూటర్లు, యంత్ర పరికరాలు
జయశంకర్ భూపాలపలి,్ల (మహబూబాబాద్) జూన్ 21 (విజయక్రాంతి): విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ కోసం జయశంకర్ భూపాలపల్లిలో ఏర్పాటుచేసిన అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం తొలకరి వర్షానికి జలమయమై పైన పటారం.. లోన లోటారంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం యువకులకు విద్యతోపాటు ఆధునికమైన సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 65 చోట్ల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కొంత మేర ఉండ గా, టాటా టెక్నాలజీ వాటా అధికంగా ఉంది. ఇందులో భాగంగా సుమారు నాలుగు కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో జయశంకర్ భూపాలపల్లిలో ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల వ్యయం తో ఏటీసీ కేంద్రాన్ని నిర్మించి, అత్యధికమైన శిక్షణ ఇచ్చే విధంగా ల్యాబ్లు, కంప్యూటర్లు, స్మార్ట్ క్లాస్ రూమ్, ఫర్నిచర్ సమకూర్చారు.
ఇందులో ప్రస్తుతం 109 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే తొలకరి వ ర్షానికి భూపాలపల్లి ఏటీసీ కేంద్రం లోకి వర్షం నీరు వచ్చి చేరిం ది. వర్షం కారణంగా ఏ టీసీ కేంద్రం ఫాల్ సీలింగ్ పె చ్చులు ఊడి పడిపోయాయి. వర్షం నీరు పడడంతో కంప్యూటర్లు ఇతర పరికరాలు తడిసిపోయాయి. అత్యంత ఖరీదైన యంత్ర సామాగ్రి తడిసిపోయింది. వివిధ సాంకేతిక కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే క్లాస్ రూమ్ ల్లోకి వర్షం నీరు చేరింది. దీనితో ఏటీసీ కేంద్రం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
కొద్దిపాటి వర్షానికే ఏటీసీ కేంద్రంలోకి నీరు భారీగా చేరడంతో భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏమిటని విద్యార్థులు వాపోతున్నారు. ఏటీసీ కేంద్రం ఏర్పాటు సమయంలో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని, దీనివల్ల కొద్దిపాటి వర్షానికి ఏటీసీ కేంద్రం అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు కూడా పట్టించుకోలేదని, దీనితో ఏటీసీ కేంద్రంలో ఫాల్ సీలింగ్ పడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. వర్షానికి తడిసిపోయిన యంత్ర సామాగ్రి, కంప్యూటర్ల పరిస్థితిని సమీక్షిస్తామని అధికారులు వెల్లడించారు.






