23-06-2025 12:00:00 AM
గ్రామాలలో వానల కోసం వేడుకోలు.. కప్పతల్లి ఆటలు
చేర్యాల, జూన్ 22: వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. అదును దాటితే పంట దిగుబడి రాదన్న ఆవేదనతో రైతన్న వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. అకాల వర్షాలతో పంట తడిసి నష్టపోయిన కర్షకులకు, సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆశగా ఎదురు చూసిన రైతన్నకు నిరాశే ఎదురవుతుంది. జూన్ మొదటి వారంలో పడాల్సిన వర్షాలు పడకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
ఇప్పటికే అకాల వర్షాలకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా వర్షాలు రాకపోవడంతో రైతులు భక్తి మార్గం పట్టాడు. గ్రామ దేవతలకు పూజలు మొదలుపెట్టాడు. చిన్నారులు వానల కోసం వర్షాలు కురవాలి వాన దేవుడా..... పంటలు బాగా పండాలి వాన దేవుడా... అంటూ పాటలు పాడుతూ కప్పతల్లి ఆటలు ఆడారు. ఈ పూజలను చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలో చిన్నారులు కప్పతల్లి ఆట ఆడారు.
పిల్లలంతా కలిసి లోకల్ బండ నాలంకరించి, మధ్యలోని సంచిలో కప్పను తగిలించి డప్పు సప్పులతో, గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వర్షాల కోసం వరుణ దేవుని వేడుకున్నారు. గ్రామంలోని మహిళలు హారతి పట్టి, కప్పతల్లి పై నీళ్లు పోస్తూ, వాన దేవునికి మొక్కుకున్నారు.