03-05-2025 12:34:48 AM
ఐటీడీఏ పీవో బి.రాహుల్
బూర్గంపాడు,మే 2(విజయక్రాంతి):రాజీవ్ యువ వికాసం పథకం కొరకు నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితా పకడ్బందీగా రూపొందించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. శుక్రవారం మండలంలోని వేపలగడ్డ,నకిరేపేట గ్రామ పంచాయతీల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవా ల న్నారు. ముఖ్యంగా గిరిజన నిరుద్యోగుల దరఖాస్తులను చాలా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి తప్పనిసరిగా రుణాలు అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లు కమిటీ సభ్యులు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి జాబితా రూపొందించా లన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీకి జాబితాలు అందించాలని ఆదేశించారు. బ్యాంకర్లు సమన్వయంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పుస్తకం, సదరం సర్టిఫికెట్, ఇతర ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
జనాభా ప్రాతిపదిక కలిగిన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఒకే గ్రామంలో ఒక యూనిట్ కు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, వ్యవసాయ సంబంధిత యూనిట్ల స్థాపనకు ప్రజలకు అవగాహన కల్పించాలని, చేపల పెంపకం యూనిట్లను ఈ పథకం ద్వారా స్థాపించడం ద్వారా వారి యొక్క ఆర్థిక పురోగతి ఉంటుందని ఆయన అన్నారు.
అదేవిధంగా పాడి పరిశ్రమలు స్థాపనకు ప్రోత్సహించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, ఎస్‌ఓ భాస్కర్, స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, ఎంపీఓ బాలయ్య,పంచాయతీ సెక్రెటరీలు బిందు,రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.