18-07-2025 08:10:26 AM
భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాద్రి రామయ్య భూములు(Bhadradri Ramaiah lands) కాపాడటానికి అదేవిధంగా పురుషోత్తపట్నం గ్రామ రైతులకు న్యాయం చేయటానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని సాదు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస నంద స్వామి తెలియజేశారు. భద్రాద్రి రామయ్య భూములు వివాదం విషయం తెలుసుకున్న స్వామీజీలు భద్రాచలం చేరుకొని భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం దేవస్థానం అధికారుల తోనూ పురుషోత్తపట్నం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వద్ద నుండి సమాచారం సేకరించటమే కాకుండా దేవస్థానం అధికారులను కూడా భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... ఎంతోకాలంగా రామయ్య భూముల మీదే తాము ఆధారపడి జీవిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారని అంతేకాకుండా భద్రాద్రి రామయ్యకు దూప దీప నైవేద్యాలు కోసం దాత పురుషోత్తమ దాస్ ఆ భూములను రామయ్యకు దానం చేశారని ఆయన తెలిపారు. అయితే ఆ భూములలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా ముఖ్యంగా రామయ్యకు వ్యతిరేకంగా నిర్వహించే అన్య మతస్థులకు రామయ్య భూములు ఇవ్వడం మరి దారుణమని తన పర్యటన సందర్భంగా తెలిసిందన్నారు. ఈ విషయాలన్నీ ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టికి తీసుకువెళ్లి ఇరు వర్గాలకు ఎటువంటి నష్టం జరగకుండా సమస్యను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. స్వామీజీ వెంట సాధు పరిషత్ గౌరవ అధ్యక్షు లు నారాయణరావు, సనాతన జేఏసీ అధ్యక్షులు తురగా శ్రీరామ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురు స్వామీజీలు హిందూ సంఘాల నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.