calender_icon.png 8 November, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యలు.. అధికారులతో రామ్మోహన్ నాయుడు సమీక్ష

08-11-2025 11:27:10 AM

  1. ఢిల్లీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్యలు..
  2. అధికారులతో  రామ్మోహన్ నాయుడు సమీక్ష
  3. రామ్మోహన్ నాయుడు మాల్దీవుల పర్యటన రద్దు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో(Delhi Airport) సాంకేతిక సమస్యలతో తన మాల్దీవులు పర్యటనను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) రద్దు చేసుకున్నారు. పలు చోట్ల సమస్యలు తలెత్తి విమానాలు ఆలస్యంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలపై రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. గత రాత్రి పొద్దుపోయేవరకు ఆయ విమానాశ్రయంలోనే గడిపారు. నిన్న బెంగళూరు విమానాశ్రయంలో కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. నిన్న రాత్రి 7 నుంచి అర్ధరాత్రి వరకు ఏటీసీలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు పలు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు అన్ని అంశాలపై శనివారం ఉదయం నుంచే ఎయిర్ పోర్టు అథారిటీ, డీజీసీఏ, విమానాశ్రయ అధికారులతో రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమాన ప్రణాళిక ప్రక్రియకు మద్దతు ఇచ్చే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (Automatic message switching system) ను ప్రభావితం చేసిన సాంకేతిక సమస్య క్రమంగా మెరుగుపడుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానయాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సంబంధిత అధికారులందరూ ఏవైనా అసౌకర్యాలను తగ్గించడానికి శ్రద్ధగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుండి విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం కావడంతో ఆర్‌జిఐ విమానాశ్రయం నుండి వియత్నాంలోని హనోయ్‌కు ప్రయాణించే ప్రయాణికులు చాలా గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. 

శుక్రవారం రాత్రి 11.55 గంటలకు ఆర్‌జీఐ విమానాశ్రయం నుండి వీఎన్- 984 విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే, శనివారం ఉదయం 9 గంటల వరకు విమానం బయలుదేరలేదు. ఆలస్యంపై ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. విమానం ఎప్పుడు వెళ్తుందో ఎయిర్‌లైన్ యాజమాన్యం చెప్పకపోవడంతో ప్రయాణికులు ఫైర్ అయ్యారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైందని, రాత్రిపూట ప్రయాణీకులకు వసతి కల్పించామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమానం ఉదయం 10 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఆర్‌జీఐ విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ వెళ్లాల్సిన అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.