08-11-2025 01:16:03 PM
హైదరాబాద్: మజ్లిస్ కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్(KCR), రేవంత్ రెడ్డి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు నాపై, బీజేపీపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాపై వ్యక్తిగత విమర్శలకు దిగానా.. భయపడను.. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ నాకు అవసరం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి బీజేపీ అవినీతి, కుటుంబ పార్టీ కాదని సూచించారు.
ఎన్నికల హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కమాట మాట్లాడరు.. హామీలు ఏం అమలు చేశారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పరని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ వైఫల్యం చెందారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే బీజేపీకి తెలుసని కిషన్ రెడ్డి తెలిపారు. మా పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలతో బీజేపీ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్లు అవినీతిని బయటపెడతానని రాహుల్, రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రూ. లక్ష కోట్లు కాదు కదా.. రూ. లక్ష కూడా వెలికి తీయలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress-BRS) మధ్య ఒప్పందం కుదిరిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఎదొస్తే అదే మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, భూముల కుంభకోణం కేసులు ఏమయ్యాయి?, సీఎం రేవంత్ రెడ్డి మాటలను మంత్రులైనా నమ్ముతున్నారా? ఆరు గ్యారంటీల గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడట్లేదు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్(Congress) దగా చేసిందని ఆయన ఆరోపించారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ. వేల కోట్లు వసూలు చేస్తోందని నిజం కాదా?, ఇక్కడ వసూలుచేసి.. బీహార్ ఎన్నికలకు(Bihar elections) డబ్బులు పంపడం వాస్తవం కాదా?, విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ డబ్బులు చెల్లించేందుకు మనసు రాదా? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ కు అడ్డుబడుతున్నానని నాపై నిందలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు?.. సీఎం రేవంత్ రెడ్డికి అసలు ఆర్ఆర్ఆర్ పై అవగాహన లేదని కిషన్ రెడ్డి చమత్కరించారు.
తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్(Kishan Reddy Challenge) విసిరారు. తెలంగాణ అభివృద్ధిపై తన వివరణను వినే ధైర్యం కేసీఆర్, రేవంత్ రెడ్డికి ఉందా?, కేసీఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ హైకమాండ్ కాదా? అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్(Congress High Command) కు భయపడి రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై చర్యలు తీసుకోవట్లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిది ఫేక్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వం అన్న కిషన్ రెడ్డి గతంలో కేసీఆర్ ది ఫ్రాడ్, ఫేక్, ఫాల్స్, ఫ్యామిటీ గవర్నమెంట్ అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్, రేవంత్ రెడ్డి అప్పల రాష్ట్రంగా మార్చారని ఆయన మండిపడ్డారు. బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషించి.. వాళ్ల కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.