08-11-2025 10:43:07 AM
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) శనివారం బనారస్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను(New Vande Bharat Trains) జెండా ఊపి ప్రారంభించారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. సెమీ-హై-స్పీడ్ రైళ్లు ప్రధాన స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ప్రాంతీయ చలనశీలతను పెంచుతాయి. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయని రైల్వే శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలు ఒక ప్రధాన కారకంగా ఉన్నాయని, భారతదేశం కూడా అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అన్నారు.
తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్(Banaras Railway Station) నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడారు. "వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు కొత్త తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయి" అని మోడీ స్పష్టం చేశారు. కేరళ నుండి వచ్చిన తాజా వందే భారత్ రైలు, లోపల, వెలుపల పూలతో అలంకరించబడి, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, డ్రాయింగ్ పోటీ ఆధారంగా ఎంపిక చేయబడిన వివిధ పాఠశాలల పిల్లలు, వివిధ విభాగాల అధికారులను తీసుకువెళ్లింది. బనారస్-ఖజురహో వందే భారత్ రైళ్లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. కొత్తగా ప్రారంభించబడిన ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ రైలులో ఉన్న పిల్లలతో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ గోపి సంభాషించి చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్య నాథ్ పాల్గొన్నారు.