21 March, 2026 | 6:43 PM

మైనార్టీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

21-03-2026 03:37 PM
  1. ముస్లిం ప్రజలందరికీ "రంజాన్" శుభాకాంక్షలు 
  2. ప్రభుత్వ విప్ : ఆది శ్రీనివాస్ 
  3. వేములవాడ లో అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు 

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో రంజాన్ పర్వదినం(Ramzan celebration) ఘనంగా జరిగింది. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, శాంతి సందేశమే రంజాన్

రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని విప్ పేర్కొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం త్యాగం, సహనం, దయ, సమానత్వం వంటి విలువలను మనకు నేర్పుతుందని అన్నారు. అల్లాహ్ దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు

తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. వేములవాడ పట్టణంలో ముస్లిం సోదరులు దశాబ్దంగా ఎదురుచూస్తున్న షాదీ ఖానా నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం పలు కీలక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా,ఇందిరమ్మ ఇళ్ల పథకం,రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ,

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యేక బీమా,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.చివరగా రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.