03-05-2025 12:41:38 AM
యువ, అనుభవజ్ఞులైన చిత్రనిర్మాతల నుంచి వినూత్నమైన, ఆలోచనలను రేకెత్తించే, ప్రగతిశీల చిత్రాలను గుర్తించి ప్రోత్సహించడం దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లక్ష్యం. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై ఈసారి ‘రజాకార్’ చిత్రానికి సముచిత గౌరవం దక్కింది. ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులను గెలుచుకుందీ సినిమా.
నిజాం ఖాసిం రజ్వీ నేతృత్వంలోని ప్రైవేట్ సైన్యమైన ‘రజాకార్’ బలంతో అరాచకం సృష్టిస్తున్న నిజాంను సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’తో ఓడించారు. 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యింది. ఈ చరిత్ర ఆధారంగానే ‘రజాకర్’ చిత్రాన్ని తీశారు. ఈతరం తమ చరిత్రను అర్థం చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు యాట సత్యనారాయణ.
ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డు..
ఈ చిత్రానికిగాను యాట సత్యనారాయణ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును అందుకున్నారు. రచయిత, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా ప్రేక్షకులను నిమగ్నం చేసేలా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు.
బెస్ట్ డీవోపీగా కుశేందర్ రమేశ్‌రెడ్డి..
ఈ ఫెస్టివల్‌లో కుశేందర్ రమేశ్‌రెడ్డికి ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది. ఇది అతని అసాధారణ సాంకేతిక ప్రతిభకు గుర్తింపు అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్ని లీనమయ్యేలా, భావోద్వేగపరంగా కనెక్ట్ చేసేలా అద్భుతమైన విజువల్స్ అందించడం ద్వారా యాట సత్యనారాయణ విజన్‌కు ప్రాణం పోశారు. ప్రతి షాట్ ఆలోచనాత్మకంగా రూపొందించారు.
తెలంగాణా అన్ సంగ్ హీరోలను గౌరవించటానికి..
చరిత్ర పట్ల లోతైన మక్కువ, తన జన్మస్థలం పట్ల గర్వంతో నిర్మా త గూడూరు నారాయణరెడ్డి తెలంగాణా అన్ సంగ్ హీరోలను గౌరవించటానికి ఈ చిత్రాన్ని నిర్మించారు. బెదిరింపులు వచ్చినా, నిర్మాణంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా భవిష్యత్ తరాల కోసం వారి వారసత్వాన్ని కాపాడాలనే తన లక్ష్యం లో ఆయన అచంచలంగా ఉంటూ ఈ చిత్రాన్ని నిర్మించారు. 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో అవార్డులను గెలుచుకోవడంతో సంతోషం గా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.