13-12-2024 01:46:50 AM
సిద్దిపేట, డిసెంబర్ 12(విజయక్రాంతి): తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదని, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రమని ఆర్‌బీఐ ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. గురువారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
అబద్ధ్దాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతోందన్నారు. ఆర్బీఐ నివేదికతో బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్ల తెలంగాణ ఆర్థిక వృద్ధ్దిపై.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చేస్తున్నది దుష్ప్రచారమని తెలిపోయిందన్నారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రతి రంగాన్ని అభివృద్ధ్దిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయని వెల్లడించారు. అంతకుముందు జిల్లా కలెక్టరేట్ ఎదుటు ధర్నా చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు హరీశ్‌రావు మద్దతు తెలిపారు.
అసమర్థ ప్రభుత్వం..
ఎస్సీ హాస్టల్స్‌ను గ్రీన్ ఛానల్‌లో పెట్టాం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్ , హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేని స్థితిలో ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఇంటిగ్రేటేడ్ వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు.
మెస్ చార్జీలు రిలీజ్ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్లు అప్పులుచేసి పిల్లలకు అన్నం పెడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఇప్పటివరకు టవల్స్, షూ ఇవ్వలేదని, 8నెలలుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు.
గురుకుల హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, వాషింగ్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం ఇటీవల గజ్వేల్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్ కుటుంబ సభ్యులను హరీశ్‌రావు పరామర్శించారు.