13-12-2024 01:43:59 AM
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్
వికారాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినుల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వెళ్తున్న మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ను వికారాబాద్‌లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తీరును నిరసిస్తూ మాజీమంత్రులు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి చన్‌గోముల్ పీఎస్‌కు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ను నవాబుపేట్ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని, ఆడపిల్లలనే కాపాడలేని ప్రభుత్వం.. ఇక రాష్ట్రాన్ని ఎలా కాపాడుతోందని ఎద్దేవా చేశారు.
అధికార పార్టీకి చెందిన వారు వసతిగృహంలోకి వెళ్లి అక్కడ అనసవరమైన రాజకీయ ప్రసంగాలు చేస్తే అడ్డుకోని పోలీసులు తాము అక్కడికి పోతే శాంతి భద్రత లకు విఘాతం కలుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. విద్యార్థునుల తల్లిదండ్రులను సైతం లోపలికి అనుమతించకపోవడం విచారకరమన్నారు.
తాము వెళ్లి పరిశీలిస్తే లొసుగులు బయటపడుతాయని ప్రభుత్వం భయపడుతుందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్‌పై ప్రభుత్వం సమీక్షలు చేయకుండా ప్రతిపక్షాలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు.