అపోలో 24/7 భారీ నిధుల సమీకరణ

27-04-2024 12:30:00 AM

అడ్వంట్ క్యాపిటల్ నుంచి రూ.2,475 కోట్లు

కైమెడ్ విలీనానికి ఒప్పందం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంస్థ అపోలో 24/7 భారీ నిధుల సమీకరణకు ఒప్పందం కుదుర్చుకుంది. అపోలో 24/7 ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వంట్ క్యాపిటల్ నుంచి  రూ.2,475 కోట్ల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు అపోలో హెల్త్  శుక్రవారం ప్రకటించింది. అలాగే దేశంలో ప్రధాన హోల్‌సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ అయిన కైమెడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను వచ్చే 25 నెలల్లో దశలవారీగా విలీనపర్చుకునేందుకు అపోలో 24/7 మరో ఒప్పందంపై సంతకాలు చేసింది. అపోలో హాస్పిటల్స్ సబ్సిడరీ అయిన అపోలో హెల్త్‌లో అపోలో 24/7 భాగంగా ఉన్నది. 

విలీన సంస్థలో అడ్వంట్‌కు 12% వాటా

అపోలో 24/7 ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.14,478 కోట్లుగా, కైమెడ్ విలువ రూ.8,003 కోట్లుగా పరిగణించి విలీనం జరుగుతుంది. దీంతో ఈ విలీన సంస్థ ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.22,481 కోట్లకు చేరుతుంది. ఒప్పందం ప్రకారం అపోలో 24/7 విలీన సంస్థలో రెండు దశల్లో కంపల్సరీ కన్వర్ట్‌బుల్ డిబెంచర్లలో అడ్వంట్ క్యాపిటల్ పెట్టుబడి చేస్తుంది. తద్వారా విలీన కంపెనీలో అడ్వంట్‌కు 12.1 శాతం వాటా సంక్రమిస్తుంది. విలీనం తర్వాత కైమెడ్ షేర్ హోల్డర్లకు గరిష్ఠంగా 25.7 శాతం, అపో లో హెల్త్‌కు మిగిలిన 59.2 శాతం వాటా ఉంటుంది. అపోలో హెల్త్‌కు ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంతో పాటు అపోలో ఫార్మసీలో 25.5 శాతం వాటా ఉన్నది. అపోలో హాస్పిటల్స్ మొత్తం ఆదాయంలో 40 శాతం అపోలో హెల్త్ ద్వారా సమకూరుతున్నది. విలీన సంస్థ ద్వారా దేశంలో ప్రజలు వారంలో ఏడు రోజులూ 24 నిముషాల్లోపు ఔషధాలను అందుకోగలుగుతారని అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ శోభనా  కామినేని తెలిపారు. కంబైన్డ్ సంస్థ మూడేండ్లలో 78 శాతం ఇబిటాతో రూ.25,000 కోట్ల ఆదాయాన్ని సాధించగలుగుతుందని అపోలో ఎండీ సునీతా రెడ్డి వివరించారు. 

‘అడ్వంట్ పెట్టుబడులు, కైమెడ్ విలీనంతో ఏర్పడే కంబైన్డ్ కంపెనీ దేశంలో ప్రధాన రిటైల్ హెల్త్ కంపెనీల్లో ఒకటిగా ఆవిర్భవిస్తుంది’

డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి

 చైర్మన్, అపోలో హాస్పిటల్స్