07-10-2025 12:03:46 AM
-రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు
-రూ.1,357 కోట్లకు 7.67ఎకరాలను దక్కించుకున్న ఎంఎస్‌ఎన్ సంస్థ
-టీజీఐఐసీ వేలంలో ఆల్-టైమ్ రికార్డు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుతోంది. ఐటీ కారిడార్‌కు గుండెకాయలాంటి రాయదుర్గంలో భూమికి ఎన్నడూ లేనంతటి ధర పలికింది. తెలంగాణ రాష్ర్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూమి ఎకరాకు ఏకంగా రూ.177 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్మక్త గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 83/1లోని మొత్తం 18.67 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్థలాన్ని టీజీఐఐసీ సోమవారం వేలం వేసింది. వేలంలో గోద్రెజ్, ఎంఎస్‌ఎం, సత్వా, హెటిరో, బ్రిగేడ్, మెయిల్, ఫ్రస్టేజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి.
భూమిని 11 ఎకరాలు, 7.67 ఎకరాలుగా రెండు భాగాలుగా విభజించి వేలం నిర్వహించారు. ఎకరాకు రూ.101 కోట్ల ప్రారంభ ధరతో వేలం ప్రారంభించారు. 7.67 ఎకరాల భూభాగాన్ని ఎంఎస్‌ఎం రియాల్టీ సంస్థ ఎకరాకు రూ.177 కోట్లకు వేలం పాడి మొత్తం సుమారు రూ.1,356 కోట్లకు దక్కించుకుంది. రియల్ ఎస్టేట్ వర్గాల ప్రకారం, ఇది దేశంలో అత్యధిక భూమి ధర సృష్టించిన లావాదేవీ. భాగ్యనగరం హైటెక్ హబ్‌లో భూమి విలువల పెరుగుదల భవిష్యత్ వాణిజ్య, ఐటీ ప్రాజెక్టులపై ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది. విజ్ఞాన భరితమైన రియల్ ఎస్టేట్ సంస్థల కోసం ఈ వేలం రికార్డు స్థాయి సరస్సు లాంటిది. గతం లో ఊహించని ధరల దిశగా భాగ్యనగరం భూమి మార్కెట్ ఇప్పుడు గరిష్ట సవాళ్లను ఎదుర్కొంటోంది.
చింతల్‌లో గజం భూమి రూ.1.14 లక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చిం తల్‌లో ప్లాట్ల విక్రయాల నిమిత్తం సోమవా రం నిర్వహించిన బహిరంగ వేలంలో గజం ధర రూ.1.14 లక్షలు పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్‌ఐజిఓపెన్ ప్లాట్‌కు గజా నికి ప్రారంభ వేలం ధర రూ.80 వేలు నిర్ధా రించగా రూ.1.14 లక్షలకు అమ్ముడుపోయి నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతం తెలిపారు.
హెచ్‌ఐజీలోనే మరో 389 గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్ గజానికి రూ.లక్ష ధర పలికిందని తెలిపారు. మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ప్లాట్ల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చిందన్నారు. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో చదరపు గజానికి సగటున రూ.91,947 ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. కేబీ హెచ్‌బీ, గచ్చిబౌలి పరిసరాల్లోని భూముల కే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో కూడా చదరపు గజం ధర రూ.లక్ష దాటడం విశేషమన్నారు.