ప్రజల కోసం పనిచేస్తేనే గుర్తింపు
జెడ్పీ చైర్‌పర్సన్ రోజా
సిద్దిపేటరూరల్, జూన్ 10: ప్రజల కోసం పనిచేసేవారికే గుర్తింపు లభిస్తుందని జెడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణ శర్మ అన్నారు. సోమవారం ఎంపీపీ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సిద్దిపేట రూరల్ మండల చివరి సర్వస భ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇది చివరి సమావేశమని దిగులుపడొద్దని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదలకు సరైన విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ ప్రాంతం వారు కావడంతో వారి ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా పనిచేద్దామని, ప్రజల బాగు కోసం ఆలోచించేవారే ప్రజాప్రతినిధులుగా ఉంటారని గుర్తుచేశారు. కాగా సమావేశానికి కేవలం ఏడుగురు ఎంపీటీసీలతో పాటు కొందరు అధికారులు మాత్రమే హాజరు కావడంతో మొక్కుబడిగా సాగింది. వివిధ శాఖల అధికారులు హాజరు కాలేదు.






