లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించు
- అవాస్తవమని తేలితే రాజీనామా చేస్తా
- కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన ముగిసేనాటికి అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రానికి రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో మొత్తం బకాయిలు రూ.90,161 కోట్లు ఉండగా, 2023 డిసెంబర్ 1 నాటికి రూ.8,21,651 కోట్లకు పెరిగిందని స్పష్టం చేశారు. ‘కేటీఆర్.. నా లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించు. తప్పని తేలితే రాజీనామాకు సిద్ధమని, మాట తప్పను’ అని జూపల్లి సవాల్ విసిరారు.
రాష్ట్ర అప్పుల అంశంపై చర్చకు గురువారం గన్‌పార్క్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి.. మీడియాతో మాట్లాడారు. భావ ఒక దగ్గర, బామ్మర్ది ఒక చోట ఉండి మాట్లాడం కాదు, ఇద్దరు కలిసి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.72,658 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి అవి రూ.3,89,673 కోట్లకు చేరాయి. ప్రభుత్వ హామీతో ప్రత్యేక ప్రయోజన సంస్థలు తీసుకుని, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు రూ.11,609 కోట్ల నుంచి రూ.1,27,208 కోట్లకు పెరిగాయి.
ఈ రెండు కలిపి ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యతగా ఉన్న అప్పులు రూ.84,268 కోట్ల నుంచి రూ.5,16,881 కోట్లకు చేరాయని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ హామీతో ఎస్‌పీవీలు తీసుకుని, వాటినే చెల్లించే రుణాలు రూ.5,893 కోట్ల నుంచి రూ.95,462 కోట్లకు పెరిగాయని, కార్పొరేషన్లు తీసుకున్న ప్రభుత్వేతర హామీ రుణాలు రూ.59,414 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. దీంతో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లకు చేరాయన్నారు.
ఉద్యోగులు, మూలధన పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.40,154 కోట్లు, డిస్కంల విద్యుత్ బకాయిలు, సింగరేణి విద్యుత్ బకాయిలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బకాయిలు తదితర ఇతర పెండింగ్ బిల్లులు మరో రూ.1,09,740 కోట్లు ఉన్నాయని మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్ర అప్పులపై ప్రజల ముందే వాస్తవాలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.






