12 April, 2026 | 10:47 PM

కమలకు చుక్కలు చూపిద్దాం

18-08-2024 01:36 AM

 రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

కమలతో డిబేట్‌కు హిందూ అమెరికన్ తులసి గబ్బార్డ్ సాయం కోరిన ట్రంప్

2019 డిబేట్‌లో కమలపై పైచేయి సాధించిన తులసి

వాషింగ్టన్ (అమెరికా), ఆగస్టు 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. మొదటి డిబేట్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. తదనంతరం సొంత పార్టీ నేతల ఒత్తిడితో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పికోగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఎన్నుకోబడటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రచారంలో భాగంగా రెండో డిబేట్ సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఈ డిబేట్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. ఈ డిబేట్‌లో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఎలాగైనా పైచేయి సాధించేందుకు ట్రంప్.. డెమోక్రాటిక్ పార్టీ మాజీ సభ్యురాలు, హిందూ అమెరికన్ అయిన తులసీ గబ్బార్డ్ సహాయం తీసుకుంటున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.  డిబేట్ రిహార్సల్ కోసం ట్రంప్ తన ప్రవేట్ క్లబ్ టీంలో తులసీ గబ్బార్డ్‌ను చేర్చుకున్నట్లు సమాచారం. ఏ డిబేట్‌లో తన వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని చిత్తు చేయగల ట్రంప్‌కు ఒకరి సహాయం ఎందుకు అనే ప్రశ్న అందరికీ తలెత్తుతోంది. 

2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో..

2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమోక్రాటిక్ ప్రైమరీ ఎంపిక సమయంలో కమల హారిస్‌తో డిబేట్ సమయంలో తులసి గబ్బార్డ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కమల విధానాలకు వ్యతిరేకంగా తులసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ డిబేట్ అనంతరం తులసి డెమోక్రాటిక్ పార్టీ నుంచి వైదొలిగారు. తాజాగా కమలాతో ట్రంప్ డిబేట్ నేపథ్యంలో మరోసారి తులసి పేరు తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డిబేట్‌లో కమలపై పైచేయి సాధించేందుకు బెస్ట్ పాలసీ అడ్వైజర్లు, ప్రభావవంతమైన కమ్యూనికేటర్ల సాయం అవసరం అని ట్రంప్ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న జరిగే డిబేట్ కోసం అందరూ వేచి చూస్తున్నారు.