మృత్యు మిల్లులు..!
- ఊపిరాడని ఉప్పరిగూడ, పోచారం!
- రైస్ మిల్లుల కాలుష్య కోరల్లో ఇబ్రహీంపట్నం గ్రామాలు..
- పదుల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు
ఇబ్రహీంపట్నం, జూలై 2(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ, పోచారం గ్రామాలు నేడు రైస్ మిల్లుల కాలుష్య రక్కసి చేతిలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. ఒకప్పుడు ఆకుకూరలు, వరి పంటలతో పచ్చగా విలసిల్లిన ఈ ప్రాంతం.. ఇప్పుడు మిల్లులు చిమ్ముతున్న నల్లటి పొగ, తెల్లటి బూడిదతో శ్మశానాన్ని తలపిస్తోంది.
తింటున్న తిండి, తాగే నీరు, పీల్చే గాలి సైతం విషతుల్యం కావడంతో ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ బారిన పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి ఇంటా శ్వాసకోశ, చర్మ వ్యాధుల బాధితులే కనిపిస్తున్నారు.
నిబంధనలు గాల్లోకి.....
గ్రామాల ఇరువైపులా ఉన్న తొమ్మిది రైస్ మిల్లుల్లో కాలం చెల్లిన పాత యంత్రాలను వాడుతున్నారు. వీటి నుంచి వెలువడే కార్బన్ డైయాక్సైడ్, కెమికల్ బూడిదను రోడ్లపైకి, పరిసర ప్రాంతాల్లోకి ఇష్టారాజ్యంగా వదులుతున్నారు. కనీసం బూడిద బయటకు రాకుండా చేయాల్సిన కాలుష్య నియంత్రణ ఏర్పాట్లు (ఫిల్టర్స్ ) ఏ ఒక్క మిల్లులోనూ లేవు. దీంతో రహదారులు దట్టమైన ధూళితో నిండిపోయి నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
వ్యవసాయం నాశనం.. రైతుల కన్నీరు..
మిల్లుల నుంచి వచ్చే బూడిద పొలాలపై పేరుకుపోవడంతో కిరణజన్య సంయోగక్రియ జరగక పంటలు ఎండిపోతున్నాయి. దిగుబడి పూర్తిగా పడిపోవడంతో రైతులు పెట్టుబడులు కోల్పోయి, తాతల నాటి వ్యవసాయాన్ని వదిలేసి కూలీలుగా మారుతున్నారు.
తక్షణ చర్యలు అవసరం..
కాలుష్యంతో మనుషులే కాకుండా మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుని, వాటిని సీజ్ చేయాలని, గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకోని పొల్యూషన్ బోర్డు..
విశ్వనాథ, వర్షా, శ్రీలక్ష్మి నారాయణ ఇండస్ట్రీస్ లపై ఎన్నిసార్లు కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ ) అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారులు వచ్చి చూసి చూడనట్లు వెళ్తున్నారు తప్ప చర్యలు లేవు. మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.‘
మహేందర్ (బాధిత రైతు)






