మహిళా ఖైదీల ఆర్థిక సాధికారతకు రేహాయ్
జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
మలక్‌పేట్, జూలై 1 (విజయక్రాంతి): మహిళా ఖైదీల పునరావాసం, ఆర్థిక సాధికారతకు మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో వారి నైపుణ్యాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు కల్పించేందుకు ’రేహాయ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో, హెర్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు దివ్యా రెడ్డి, బాబీ కందహారి సహకారంతో ‘రేహాయ్‘ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రత్యేక మహిళా జైలులో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. జైలు శిక్ష అనేది శిక్షతో ముగియకుండా పునరావాసానికి, స్వయం ఉపాధికి, ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలని తెలిపారు. ఇప్పటికే మహిళా ఖైదీల్లో ఉన్న నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసి, మార్కెట్కు అనుసంధానం చేయడం ద్వారా గౌరవప్రదమైన జీవనోపాధి పొందేలా రేహాయ్ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ మార్కెట్లకు అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.
రేహాయ్ కార్యక్రమం ద్వారా ఆ ప్రాథమిక నైపుణ్యాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, డిజైనర్ దుస్తులు, ప్రీమి యం హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హై-ఎండ్ ఫ్యాష న్ ఉత్పత్తుల తయారీలో వారికి ప్రత్యేక శిక్షణ డిజైనింగ్, నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల ఫినిషింగ్, మార్కెట్ అవ సరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ప్రిజన్స్ డా. డి. శ్రీనివాస్, సెంట్రల్ ప్రిజన్ సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్, ప్రత్యేక మహిళా జైలు సూపరింటెండెంట్ వెంకట లక్ష్మీ శ్రీనాథ్, డీఎస్పీ జైల్స్ అమరావతి, హెర్‌రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది, మహిళా ఖైదీలు పాల్గొన్నారు.






