05-01-2026 12:05:05 AM
చారకొండ, జనవరి 4: డిండి - నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ లో ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రీలే నిరహార దీక్షలు ఆదివారం 34వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తమ సమస్యను ప్రస్తావించి, ముంపు నుంచి ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం సంతోషమని అన్నారు. గ్రామస్థుల పక్షాన ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో ఇచ్చేలా ఎమ్మెల్యే కృషి చేస్తే రుణపడి ఉంటామని తెలిపారు. అప్పటి వరకు శాంతియుతంగానే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్, నాగయ్య, పెద్దయ్య, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.