9 July, 2026 | 1:23 AM

కువైట్‌లో తెలంగాణ యువకుడి మృతి

09-07-2026 12:54 AM

అక్కడే ఎడారిలో పూడ్చిపెట్టిన నిందితుడు

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాశ్ (30) కువైట్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 19న జేసీబీ మరమ్మతు ఉందని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో కైలాశ్ మృతిచెందాడు. కైలాశ్‌తో వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నిందితుడు మరొకరితో కలిసి కైలాశ్ మృతదేహాన్ని సాల్ని ఎడారిలో పూడ్చి పెట్టాడు. కైలాశ్ కనబడటం లేదని అక్కడి మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో ఈ దారుణం బయటకొచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా నిందితుడు ఇటీవలే కువైట్ నుంచి నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి వచ్చాడు. కైలాశ్ బంధువులు కువైట్‌లో కేసు విచారణ జరుగుతుందని బాధిత కుటుంబానికి సమాచారం అందించా రు. ఇక్కడకు వచ్చిన వ్యక్తి పాత్ర ఉన్నట్లు సమాచారం అందడంతో కైలాశ్ కుటంబ సభ్యులు, తండావాసులు డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆరిఫ్ వెల్లడించారు.