26-07-2025 10:57:42 PM
హుస్నాబాద్‌లో 'స్మార్ట్'గా మోసాలు
నాసిరకం, కాలంచెల్లిన వస్తువుల అమ్మకాలు
బయటపడిన రిలయన్స్ స్మార్ట్ పాయింట్ డొల్లతనం
రూ.30వేల ఫైన్ విధించిన మున్సిపల్ కమిషనర్..
హుస్నాబాద్: పేరుకు 'స్మార్ట్' మార్ట్ అయినా నాసిరకం, కాలంచెల్లిన వస్తువులను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్(Reliance Smart Point) డొల్లతనం బయటపడింది. శనివారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో మోసాలు బట్టబయలయ్యాయి. ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు, మార్ట్‌కు రూ.30 వేల జరిమానా విధించారు. నన్నె శ్రీనివాస్ అనే కస్టమర్ కొనుగోలు చేసిన పన్నీర్‌లో ఫంగస్ వచ్చిందని ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదు అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ బృందంతో కలిసి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మార్ట్‌లోని నిత్యావసర వస్తువులు, తినుబండారాలపై ఉన్న గడువు తేదీలను (ఎక్స్‌పైరీ డేట్స్) అధికారులు నిశితంగా పరిశీలించారు.
పలు ఉత్పత్తులు గడువు తేదీ దాటిపోయినప్పటికీ, వాటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు."స్మార్ట్ పాయింట్" పేరుతో ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని, ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రిలయన్స్ మార్ట్ తీరుపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌పైరీ డేట్ దాటిన వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తుల గడువు తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, నాసిరకం వస్తువుల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ ఇన్‌చార్జి మేనేజర్ సంపత్ రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, ఇన్‌చార్జ్ ఆర్ఐ ప్రసాద్, శంకర్, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.