24-05-2025 12:04:37 AM
దరఖాస్తుల ఆహ్వానం
కాళేశ్వరం జోన్ జోనల్ అధికారిఅరుణ కుమారి
మంచిర్యాల,(విజయక్రాంతి): కాళేశ్వరం జోన్ లో గల ఆసిఫాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాలలోని 25 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో (బాలురు, బాలికలు) ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం కొరకు తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది ఎంపిక కొరకై అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కాళేశ్వరం జోనల్ అధికారి హెచ్. అరుణ కుమారి శుక్రవారం తెలిపారు. కాళేశ్వరం జోన్ పరిధిలోనీ కొమురం భీo ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని సైన్స్, ఆర్ట్స్ కళాశాలల్లో ఖాళీలకు తాత్కాలిక పద్ధతిన తెలుగు, హిందీ, ఇంగ్లీషు (లాంగ్వేజెస్) జూనియర్ లెక్చరర్/పిజిటి/టీజీటీతో పాటు హెల్త్ సూపర్వైజర్/పిఈటి/పిడిల ఎంపికకు ఈ నెల 29న, కోర్ సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, లైబ్రేరియన్ సబ్జెక్టులకు ఈ నెల 30న మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల (బాలుర)లో, ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలో గల ఖాళీలకు ములుగు జిల్లా జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలురు)లో ఉదయం 9 గంటల నుంచి పాఠ్యాంశ బోధన డెమోలు ఉంటాయన్నారు.
జూనియర్ లెక్చరర్, పీజీటీ పోస్టులకు యుజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీతో పాటు బీఇడీ అర్హత ఉండాలని, టీజీటీ పోస్టుకు యుజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, బీకాం, బీఏ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో పాటు, బి.ఇడి అర్హత కలిగి ఉండాలన్నారు. అలాగే పీఈటీ/పీడీ పోస్టులకు యుజీడీ-పీఎడ్, బీపీఎడ్, ఎంపీఎడ్ అర్హత కలిగి 50 శాతం మార్కులకు తగ్గకుండా ఉండాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు జనరల్ నర్సింగ్, జీఎన్ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలన్నారు. రెసిడెన్షియల్ విద్యా బోధన పట్ల అవగాహన, ఆసక్తి గల అభ్యర్థులు సమీప సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఈ నెల 24 నుంచి 27 వరకు పూర్తి బయోడేటా తో పాటు, ధృవ పత్రాల జిరాక్స్ కాపీలు జత పరచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బాలికల విద్యాలయాలలో పనిచేయడానికి స్త్రీ అభ్యర్థులు మాత్రమే అర్హులని, జూనియర్ లెక్చరర్ల వేతనం రూ. 23,400, పీ జీ టీ/టీ జి టి వేతనం 18,200 రూపాయలు ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.