20 April, 2026 | 7:09 PM

మా అస్తిత్వాన్ని కాపాడండి

20-04-2026 06:00 PM

* నాయకపోడ్ కుల గణనపై కలెక్టర్ కు వినతి

గుండాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో నాయకపోడ్ తెగ జనాభా వివరాలను సరిచేయాలని, రాబోయే జనగణనలో ప్రత్యేక గుర్తింపునివ్వాలని కోరుతూ సోమవారం ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ​ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ఇటీవల ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటించిన జనాభా వివరాలలో నాయకపోడ్ తెగ జనాభాను అతి తక్కువగా (కేవలం 16,000 గా) చూపడం జరిగింది.

ఇది వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మా జనాభా సుమారు 70,000 పైచిలుకుగా ఉందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల నాయకపోడ్ జనాభా కలిగి ఉన్నామని, 1949లో షెడ్యూల్డ్ తెగల జాబితాలో స్వతంత్రంగా ఉన్న మా తెగను, 1950 లో గోండు తెగకు ఉప తెగగా మార్చి సీరియల్ నంబర్ 6 లో చేర్చడం జరిగిందని అన్నారు. దీనివల్ల మా ప్రత్యేక సంస్కృతి, ఉనికి కనుమరుగవుతున్నాయని, ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ అవకాశాలు మా జాతికి సరిగ్గా అందడం లేదని వాపోయారు. ​

ప్రస్తుత ప్రభుత్వ సర్వేలోని తప్పులను వెంటనే సవరించి, మా వాస్తవ జనాభా లెక్కలను ప్రకటించాలని, ​రాబోయే కేంద్ర ప్రభుత్వ కుల గణన మరియు జనగణనలో నాయకపోడ్ తెగకు ప్రత్యేక కాలమ్ (Column) కేటాయించి మా వివరాలను నమోదు చేయాలని, ​షెడ్యూల్డ్ తెగల జాబితాలో మా తెగకు తిరిగి ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించి మా అస్తిత్వాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ​మా జాతి ఉనికిని, హక్కులను కాపాడటానికి  జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.