21-01-2026 12:00:00 AM
కలెక్టర్ కే హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 20 (విజయ క్రాంతి): ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీఓ లోకేశ్వర్ రావులతో కలిసి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల జాబితాను ఈ నెల 24వ తేదీలోగా సమర్పించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులచే దేశభక్తి గీతాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కృషి
జిల్లా మొదటి మహిళా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె. హరిత కెరమెరి మండ లం జోడేఘాట్లోని భీం సమాధిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఆదివాసీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.