06-08-2025 02:14:23 PM
మందమర్రి,(విజయక్రాంతి): బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి పట్టణానికి వచ్చిన ఎన్ రామచంద్రరావు(N. Ramchander Rao)ను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. సోమవారం పట్టణం లోని పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన పలు పార్టీల నాయకులు పట్టణంలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన తోళ్లపరిశ్రమ ను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టి స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ లెదర్ పార్కు సాధన, చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొలుగూరి విజయ్ కుమార్ వినతిపత్రం అందజేశారు.
అలాగే పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ జనసేన నాయకులు మాయ రమేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ తోళ్ళ పరిశ్రమను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిశ్రమ ప్రారంభించి స్థానికులకు ఉపాధి కల్పించేలా తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే మున్సిపల్ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.