3 April, 2026 | 1:25 AM

రిజర్వేషన్ల రద్దు జరగదు

06-05-2024 02:00 AM

ముస్లింల కోటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు

బీజేపీని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు

షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తాం

బీడీ కార్మికులకు దవాఖాన నిర్మిస్తాం

ట్రిపుల్ తలాక్ రద్దుతో సంతోషంగా ముస్లింలు

నా ఫేక్ వీడియో తయారుచేసిందే రేవంత్‌రెడ్డి 

నిజామాబాద్, కాగజ్‌నగర్, హైదరాబాద్ సభల్లో అమిత్‌షా 

కుమ్రంభీం ఆసిఫాబాద్/ నిజామాబాద్/హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దుచేసే ప్రసక్తే లేదని కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి ఆ కోటాను ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు పంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తారని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తామని నేను అన్నట్టు నకిలీ వీడియోను తయారు చేసింది తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డే. ఆ జూటా వీడియోను సోషల్‌మీడియాలో పెట్టి అబద్ధాలు  చెప్తున్నారు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కుంభకోణాలు మొదల వుతాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తెలంగాణలో మూడు సభల్లో మాట్లాడారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. గరీబోళ్లకు న్యాయం చేసే మోదీ కావాలా? దోచుకొనే రాహుల్ కావాలా? ఆలోచన చేయాలని సూచించారు. రూ.12 లక్షల కోట్లు లూటీ చేసిన కాంగ్రెస్ పార్టీ  మళ్లీ అధికారంలోకి వస్తే దోపిడీ పెరుగుతుందని అన్నారు. కశ్మీర్ కోసం తెలంగాణ యువకులు ప్రాణాలు ఇస్తున్నారని ప్రశంసించారు. సోనియా, మన్మోహన్ సర్కారు పదేండ్లపాటు అల్లర్లు, గొడవలు, కుంభకోణాలతో నడిస్తే.. మోదీ సర్కార్ తీవ్రవాదుల భరతం పట్టి పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిందని తెలిపారు. 

ఒవైసీ అంటే ఆ పార్టీలకు భయం

బీజేపీ తీసుకొచ్చిన ట్రిఫుల్ తలాక్‌తో ముస్లిం మహిళలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అమిత్ షా తెలిపారు. ఎంఐఎం నేత ఒవైసీ అంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భయమని ఎద్దేవా చేశారు. బీజేపీ వస్తే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో పదికిపైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ ఎంపీగా గొడం నగేష్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  

పసుపు బోర్డు తెస్తాం

నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ను మరోసారి గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి, బీడీ కార్మికుల కోసం దవాఖాన నిర్మిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆర్‌ఆర్ టాక్స్ విధిస్తోందని ఆరోపించారు. ఆర్‌ఆర్ టాక్స్ అంటే రాహుల్ టాక్స్ అని తెలిపారు. ‘తెలంగాణలో ఏబీసీ త్రయం నడుస్తోంది. ఏ అంటే అసదుద్దిన్ ఒవైసీ, బీ అంటే బీఆర్‌ఎస్, సీ అంటే కాంగ్రెస్. వీరు ముస్లింలతో అంటకాగేవారు. రామ మందిర నిర్మాణాన్ని, తెలంగాణ విమోచనాన్ని వ్యతిరేకిస్తారు. ఎన్నికల్లో బీజీపీని గెలిపించి ఏబీసీ త్రయాన్ని ఓడించి తెలంంగాణ అభివృద్ధికి సహకరించండి’ అని కోరారు.   

మేం ఇప్పటికే వంద సీట్లు గెలిచాం  

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నిర్వహించగలవా? అని అమిత్ షా ప్రశ్నించారు. వాళ్లు నిర్వహించాలనుకొన్నా ఒవైసీ జరగనిస్తారా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీకి ఇప్పటికే వంద స్థానాల్లో గెలుపు ఖాయమైందని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వేసే ప్రతి ఓటు మోదీని ప్రధానిని చేసేందుకేనని చెప్పారు. దీపావళి రోజు కూడా సెలవు తీసుకోకుండా సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులతో పండగ చేసుకునే మోదీ ఎక్కడ.. ఎండలు పెరగ్గానే థాయిలాండ్ వెళ్లే రాహుల్‌గాంధీ ఎక్కడ అని వ్యాఖ్యానించారు. ‘దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా మోదీ ప్రధాని కావాలనే అంటున్నారు. కానీ ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి.

శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్‌గాంధీలో ఎవరు ప్రధాని అభ్యర్థి?’ అని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దుచేస్తామని ప్రకటించారు. తనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని, అయినా తాను బెదరబోనని స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేస్తామని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్, మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ తిలక్ తదితరులు పాల్గొన్నారు.