calender_icon.png 6 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వ్యవసాయ యాంత్రీకరణ’ పునఃప్రారంభం

06-09-2025 01:27:08 AM

-ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలు

-సర్కార్ నిర్ణయంతో  తెలంగాణ రైతుల్లో ఉత్సాహం 

-ఏడేళ్ల క్రితమే పథకాన్ని నిలిపివేసిన బీఆర్‌ఎస్ సర్కార్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఒక వైపు వ్యవసాయం ఉత్పత్తి సాగు ప్రతి ఏటా పెరుగుతోంది. మరో వైపు కూలీల కొరత తీవ్రమవుతోంది.  కూలీల దొరక్కపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకు కూలీల కొరతను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన వ్యవసాయ యంత్రాల పరికరాలపై  సబ్సిడీ పథకం.. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో 2017 నుంచి  పూర్తిగా నిలిచిపోయింది. 

ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి వ్యవసాయ యంత్రాల సబ్సీడి  పథకాన్ని  ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పంట దిగుబడి పెంచేలా, అధునాతమైన యంత్రపరికరాలు అంధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 50 శాతం రాయితీపై వ్యవసాయ యంత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను  కేంద్ర ప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద  రూ. 20 కోట్లు మంజూరు చేయడంతో రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.  ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను నేరుగా వ్యవసాయ శాఖ నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగతా రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం అందించనుంది. సాగు ఖర్చులు తగ్గించి .. రైతులు ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   

రైతులకు అందించే వ్యవసాయ యంత్రపరికరాలు..

అయితే ఈ పంపిణీ పథకంలో  గతంలో ట్రాక్టర్ల పంపిణీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అవి చిన్న, సన్నకారు రైతులకు కాకుండా పెద్ద రైతులకు మాత్రమే ఉపయోగపడేవి. ఇప్పుడు  ట్రాక్టర్లను పంపిణి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హార్వెస్టర్లు, పవర్ టిల్లర్, ఎంబీ నాగళ్లు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డి కట్టలు కట్టే బేలార్ యంత్రాలు, రోటోవేటర్లు, పత్తితీత, మామిడికాయలను తెంపే మిషన్లు,  పసుపు ఉడికించే యంత్రాలు , మొక్కజొన్నలను ఒలిచే మిషన్లను పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 40 శాతం రాయితీపై ఇనుప నాగళ్లు, ట్రాక్టర్ల పరికరాలు, కలుపు తీసే యంత్రాలు, సస్యరక్షణ పరికరాలు, టార్ఫాలిన్లు, చేతి పంపులు, పవర్ స్ప్రేయర్లు తదితర పరికరాలను వ్యవసాయ శాఖ మంజూరు చేసేది.  తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటిసారి రైతులకు ట్రాక్టర్లను సబ్సిడీ కింద పంపిణి చేసింది. ఆ తర్వాత రైతు బంధు పథకం తీసుకురావడంతో సబ్సీడిపై అందించే  వ్యవసాయ యంత్ర పరికరాల పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది.

దీంతో  సన్న, చిన్నకారు రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయలేక సాగు చేయడం కూడా మానేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్దరిస్తుండటంతో రైతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ రాయితీ పథకానికి ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులను ప్రభుత్వం అర్హులుగా గుర్తించనుంది. మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా  దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు.