calender_icon.png 6 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌరుల ప్రయోజనాలకే ప్రాధాన్యం

06-09-2025 01:29:46 AM

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ప్రతిపాదనేమీ లేదు

జీఎస్టీ సంస్కరణలతో పాప్‌కార్న్ వివాదానికి తెర పడింది

‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ అన్నవారే క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు

-జీఎస్టీ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్సే’

-జీఎస్టీ రెండో తరం సంస్కరణలు కేవలం బీహార్ కోసమే కాదు 

-‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలోని సామాన్యపౌరులకు మేలు చేసేందుకే జీఎస్టీ సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రెవెన్యూ లోటు అనేది సెకండరీ అని.. మొదటి ప్రాధాన్యం పౌరుల ప్రయోజనాలే అని తెలిపారు. శుక్రవారం ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎవరు విమర్శలు చేసినా జీఎస్టీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్సే అన్నారు.

గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఆరోపించిన వారు ప్రస్తుతం సంస్కరణలు చేయగానే ఘనత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు జీఎస్టీ గురించి మాట్లాడే ముందు హోం వర్క్ చేస్తే బాగుంటుందని సూచించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయని అటువంటి వారికి అండగా ఉంటామన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనేమీ లేదని పేర్కొన్నారు. 

గుడ్ అండ్ సింపుల్ ట్యాక్సే.. 

‘సామాన్య పౌరులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. రెవెన్యూ లోటు తర్వాతి విషయం. జీఎస్టీ సంస్కరణల వల్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని కొన్ని రాష్ట్రాలు కంగారుపడుతున్నాయి. ఆదాయ మార్గాల కంటే పౌరులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధాని మోదీ వంటి నేత వల్లే ఇది సాధ్యమైంది. కరోనా విపత్తులో కూడా ఆదాయం గురించి ఆయన బెంగపడలేదు.జీఎస్టీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జీఎస్టీ సంస్కరణలు ఈ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తాయి. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గత ఏడాదిన్నరగా శ్రమిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించడంతో సంస్కరణలకు కాస్త ఆలస్యం అయింది. జీఎస్టీ తగ్గింపు ప్రతిఫలాలను సామాన్యులకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్ని వర్గాల వారిని సంప్రదించి వారు హామీ ఇచ్చిన తర్వాతే సంస్కరణలు చేపట్టాం. జీఎస్టీ సంస్కరణలు కేవలం బీహార్ కోసమే కాదు. ఈ సంస్కరణలు మొత్తం దేశానికి వర్తిస్తాయి. రైతులు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు మరింత ప్రయోజనం చేకూర్చేలా సంస్కరణలు రూపొందించాం. ప్రధాని సామాన్యుడిపై పన్ను భారం తగ్గించాలని తెలిపారు. 140 కోట్ల భారతీయు లను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలు తీసుకొచ్చాం. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాలకు కలిగే నష్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం సమానంగా పంచుకోవాలి.

రెవెన్యూ లోటు కేంద్రానికి కూడా ఇబ్బంది కలిగించే అంశమే. మేము రాష్ట్రాలకు దాతలం కాదు. జీఎస్టీని మరింత సులభంగా చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రం కొన్ని రకాల పన్నులను వదులుకున్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనే లేదు. వాటిపై విధించే పన్నులు రాష్ట్రాల ఇష్టం. జీఎస్టీ 3.0 వచ్చే ఆస్కారం ఉంది. మొదట దేశం మొత్తం ఒకే పన్ను విధానం తీసుకురావాలనుకున్నాం. తర్వాతి దశలో దాన్ని సరళీకృతం చేశాం. జీఎస్టీని మరింత సరళీకృతం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఎగుమతిదారులపై ఎటువంటి పన్ను భారం మోపం. అమెరికా సుంకాల వల్ల పడే భారాన్ని ఎగుమతిదారులపై మోపం. సుంకాల భారం గురించి జీఎస్టీ కౌన్సిల్‌కు ఎటువంటి అధికారం లేదు. ప్రభుత్వం చూసుకుంటుంది’ అని తెలిపారు.  

జీఎస్టీ గురించి తెలుసుకుని మాట్లాడండి

జీఎస్టీ గురించి మాట్లాడే ముందు పన్ను విధానం గురించి పూర్తిగా తెలుసుకుని మా ట్లాడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ ప్రతిపక్షాలకు సూచించారు. ఏది పడితే అది ఆరోపించడం కాకుండా మాట్లాడే ముందు తెలుసుకోవాలన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా జీఎస్టీ గుడ్ అండ్ సింపు ల్ ట్యాక్సే అని పేర్కొన్నారు. జీఎస్టీని ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ అని గతంలో ఆరోపించిన ప్రతిపక్షాలు ప్రస్తుత సంస్కరణల తర్వాత క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత యూపీఏ ప్రభుత్వం విపరీతంగా పన్ను లు విధించి.. అటు వినియోగదారులతో పాటు వ్యాపారవేత్తలను కూడా ఇబ్బందులకు గురి చేసింది. మోదీ ప్రభుత్వం సామా న్యుడికి ప్రయోజనం కలిగించేందుకే ఈ సం స్కరణలు తీసుకొచ్చింది. 

పాప్‌కార్న్ వివాదానికి తెర

కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల పాప్‌కార్న్ వివాదానికి తెరపడింది. థియేటర్లలతో పాటు బయట కూడా లభించే పాప్‌కార్న్ మీద గతంలో వేర్వేరు స్లాబుల్లో పన్నులు విధించే వారు. దీంతో అంతా గందరగోళానికి గురయ్యేవారు. ప్రస్తుతం ఎటువంటి పాప్‌కార్న్ అయినా సరే ఒకే పన్ను ఉండేలా నిర్ణయించారు. ప్రస్తుతం ఉప్పు, మసాలాలు కలిపిన పాప్‌కార్న్ (సాల్టెడ్ పాప్‌కార్న్) మీద 5 శాతం పన్ను విధిస్తున్నారు. వదులుగా అమ్మినా, ప్యాకింగ్ చేసి అమ్మినా, లేబుల్‌తో విక్రయించినా అంతే పన్ను వర్తించనుంది. గతంలో మాత్రం వదులుగా అమ్మితే 5 శాతం, ప్యాక్ చేసి అమ్మితే 12 శాతం పన్ను విధించే వారు. ఈ పాప్‌కార్న్ పన్ను స్లాబులపై అనేక వివాదాలు నడిచాయి.