calender_icon.png 5 January, 2026 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్, రాహుల్.. మోసకారులు!

05-01-2026 01:28:46 AM

  1. ప్రజలను వంచించినోళ్లను ఎన్నిసార్లు ఉరితీయాలి?

నదీ జలాలపై అవగాహన లేని వ్యక్తి సీఎం కావడం దౌర్భాగ్యం

సీఎం రేవంత్‌రెడ్డికి బేసిన్లు, బేసిక్స్ ఏమీ తెలియవు

కేసీఆర్‌పై వికృత వ్యాఖ్యలతో అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం

కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే..

సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసకారులని.. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు వారిని ఎన్నోసార్లు ఉరితీయాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నదీ జలాలపై కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా తెలంగాణ కు చేస్తున్న ద్రోహాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి బీఆర్‌ఎస్ తరఫున ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదా లు, కొనసాగుతున్న అన్యాయాల పరంపర, వాటి వల్ల తెలంగాణ ఎదుర్కొన్న నష్టాలను వివరంగా ప్రజల ముందుంచే ప్రయత్నమే బీఆర్‌ఎస్ ప్రజెంటేషన్ ఉద్దేశమని స్పష్టం చేశా రు. ఉరిశిక్షల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై ఘాటుగా స్పందించిన కేటీఆర్, మాట తప్పిన హామీలకు లెక్క వేస్తే కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలో కూడా తెలియద న్నారు.

అశోక్ నగర్ అడ్డా మీద రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాంధీపై, రైతు రుణమాఫీ హామీ అమలు చేయని వరంగల్‌లో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజ లు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచ్చిం దని విమర్శించారు. 

రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదని, కానీ తాము కావాలంటే మూడు నాలుగు భాషల్లో సమాధా నం చెప్పగల శక్తి ఉందన్నారు. ఐఐటీకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియదని, బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియని అజ్ఞా నం ఉన్న వ్యక్తి తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్ప దమన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని, ఉష్ణపక్షి పాలన ఇది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పరుష మాటలు అవమానకరం..

శాసనసభలో జరుగుతున్న చర్చల తీరు ను, ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత పెద్దలు చెప్పిన మాట ‘వినాశకాలే విపరీత బుద్ధి’ గుర్తుకు వస్తోం దన్నారు. అధికార మదంతో విర్రవీగుతూ, అహంకారంతో, పరుషమైన మాటలతో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. పదే పదే చావు, ఉరిశిక్షలు అంటూ మాట్లాడే వ్యక్తి గురించి మాట్లాడుతూ, రైతుబంధు వంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్‌పై అనరాని మాటలు అనడం దుర్మార్గమన్నారు.

తెలంగాణ ముక్తి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని, తన చావు నోట్లోనే తలపెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడని కేటీఆర్ గుర్తుచేశారు. కరువు నేలల్లో సిరులు పండించి, మరణ మృదంగాలు మోగిన ప్రాంతాల్లో జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడిపై అహం కారంతో, ద్వేషంతో మాట్లాడటం తెలంగాణ ప్రజల గుండెలను రగిలిస్తోందన్నారు. నదీ జలాలపై చర్చ పెట్టిన ముఖ్యమంత్రికి అసలు బేసిన్ల అర్థమే తెలియదని కేటీఆర్ విమర్శించారు. 

అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్...

దేవాదుల ఏ బేసిన్లో ఉందో కూడా తెలియని వ్యక్తి ఇరిగేషన్‌పై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరమన్నారు. వడ్డేపల్లి పంప్ హౌస్ మునిగిపోయినా చర్యలు లేవని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది కార్మికులు ప్రాణా లు కోల్పోయినా ఇప్పటికీ శవాలను వెలికి తీయలేని అసమర్థత ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినప్పుడు నిర్మాణ సంస్థను బ్లాక్లిస్ట్ చేయాలని అధికారులే సూచించినా అమలు చేయలేని అశక్తతను ఎండగట్టారు.

ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి లేదన్నారు. పేదల ఇళ్లను కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్, సర్వే సర్వత్రా విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వం ఇదేనని, అలాంటి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.

కాంగ్రెస్, టీడీపీలే బాధ్యత వహించాలి..

రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే వందలాది రైతులు, ఆటోడ్రైవర్లు, గురుకుల విద్యార్థులు, నేతన్నలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేడని స్పష్టం చేశారు.

నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది కేవలం నేటి సమస్య కాదని, నిజాం కాలం తర్వాత 65 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఆపై 17 ఏళ్ల చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ పాలనలోనే ఈ ద్రోహం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. 2014 వరకు రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలే ఈ అన్యాయాలకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని ఎలా సరిచేయాలనే ప్రయత్నాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసిందో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందుంచామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు నిరంతరం ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.