calender_icon.png 21 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి రేసింగ్ ఫ్లయింగ్ సీఎం

21-12-2025 01:03:29 AM

ఢిల్లీకి చక్కర్లు కొట్టడమే 

ఆయన పని 

అబద్ధాలు ఆడటంలో 

నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి 

ఎరువులు అడిగితే మ్యాపులు, యాప్‌ల పేరుతో డ్రామాలు

రెండేళ్లలో కేసీఆర్ సీఎం కావడం ఖాయం

మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి, డిసెంబర్ 20(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేసింగ్ సీఎం కాదని.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరిగే ఫ్లయింగ్ సీఎం అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్‌రెడ్డికి నోబల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. శనివారం ఆయన సంగారెడ్డి, ఆందోల్ నియోజ కవర్గాల్లో గెలుపొందిన నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యుల సన్మాన కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా అద్భుతంగా ఎదిరించి గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు బీఆర్ ఎస్ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరులో కాంగ్రెస్ బేజారైందన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కాం గ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదన్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎరువు బస్తాలు కావాలంటే యాప్‌లో కొట్టండి అంటున్నాడు.. రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా నీవు వ్యవసాయం చేశావా? రైతుల కష్టం మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చినంక రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు, కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు, ఎరువుల కోసం లైన్‌లో నిలబడి రైతులు గోసపడుతున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల లారీలను ఊర్లకే పంపి రైతులకు అందించాడని గుర్తు చేశారు. యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు.. రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిండు.. రుణమాఫీ సగం మందికి కూడా చేయలేదన్నారు.

మున్సిపాలిటీల సమయం ముగిసి సంవత్సరం అవుతున్నా ఎన్నికలు పెట్టట్లేదని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదని, రేవంత్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందన్నారు.రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే, రైతులకు మేలు చేసెటోడివే అయితే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85 శాతం ఢిల్లీ నుంచి గల్లికే వస్తాయని, రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే ఆపలేరని, డైరెక్ట్ సర్పంచుల ఎకౌంట్లో పడతాయని చెప్పారు. సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదామని, మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్ గా గెలిచారు.మీ పదవీకాలంలో మళ్ళీ మూడేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ఉంటారని తెలిపారు. ఓడిపోయిన వారికి భవిష్యత్తు ఉంటదని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందన్నారు.

ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సింగరేణి కార్మికుల డబ్బులు.. 

సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మనవడి కోసం ఫుట్ బాల్ బ్యాచ్ పెట్టిండని, ఇందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టాడని, ఆ డబ్బులన్నీ సింగరేణి కార్మికుల 10 కోట్ల డబ్బును మ్యాచ్‌కు పెట్టినట్లు హరీశ్‌రావు ఆరోపించారు. గవర్నమెంట్ ఖజానా నుంచి ఐదు కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ సొంతంగా కట్టుకున్నాడని తెలిపారు. సింగరేణి సీఎస్‌ఆర్ డబ్బులతో కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్‌రెడ్డి అందాల పోటీలు, ఫుట్ బాల్ మ్యాచ్లు, గ్లోబల్ సమ్మిట్ పేరుతో జల్సా చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, నాయకులు పట్నం మాణిక్యం, రాజేందర్, డాక్టర్ శ్రీహరి, నరహరి, బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.