రేవంత్‌కు ప్రజలే చార్జ్‌షీట్ వేస్తారు
l బీజేపీకి ఎందుకు చార్జ్‌షీట్ వేస్తారో సీఎం చెప్పాలి
l మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే సీఎం రేవంత్ రెడ్డికి చార్జ్‌షీట్ వేస్తారని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ‘తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహం’ పేరిట సీఎం రేవంత్ రెడ్డి చార్జ్‌షీట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంపై ఈటల గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మీద చార్జ్‌షీట్ ఎందుకు వేస్తారు.. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌లో శాంతి నెలకొల్పినందుకా.. రామ మందిరం నిర్మించినందుకా.. పేదవారి సొంతింటి కలను నెరవేర్చినందుకా అని ప్రశ్నించారు. సీఎం చార్జ్‌షీట్ పెట్టాల్సింది కేసీఆర్ మీద అన్నారు. బోఫోర్స్ స్కాం, కోల్ స్కాం, 2జీ స్కాంల మీద చార్జ్‌షీట్ విడుదల చేస్తారా అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా సక్రమంగా అమలయ్యాయా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ నమోదు చేయాలని పేర్కొన్నారు.






