calender_icon.png 21 January, 2026 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

21-01-2026 07:44:31 PM

- బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కే  శ్రీనివాస రావు కోరారు. బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి, యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బుధ వారం ప్రగతి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత ప్రచారంలో భాగంగా నిర్వహించిన ‘అరైవ్, అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, మొబైల్ ఫోన్ వాడ వద్దని, స్పీడ్ లిమిట్ పాటించడంతో పాటు ఓవర్‌లోడ్ తో వాహనం నడుపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టం కాదని, కుటుంబాలకు, సమాజానికి తీవ్ర నష్టమని, యువతే భవిష్యత్తు అని, వారు రోడ్డు భద్రతను పాటించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. అనంతరం కాలేజీలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డులపై, బెల్లంపల్లి నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల గోడలపై పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ ASI మహేంద్ర పాలన్, కానిస్టేబుళ్లు ఆర్. శ్రవణ్, జి. గణేష్, ప్రగతి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.