21-11-2025 10:18:48 PM
బెల్లంపల్లి అర్బన్: బెల్లంపల్లి పట్టణంలోనీ శిశుమందిర్ రోడ్డు విస్తరణలో ఇండ్లు, వ్యాపారాలు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలోశుక్రవారం ఎంఎల్ఏ గడ్డం వినోద్ క్యాంపు, మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఆందోళన కారులకు ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన క్యాంపు కార్యాలయం గేట్ కు వినతిపత్రం తాడు తో కట్టి వెనుదిరిగారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, టీపీఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ... రోడ్డు వెడల్పు పేరుతో పేదలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిశుమందిర్ రోడ్డు అవసరానికి మించి 60 ఫీట్లు వెడల్పు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రోక్లైన్లతో ఇండ్లను కూల్చి ఆస్తులను ధ్వంసం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం 60 ఫీట్ల నుండి 40 ఫీట్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆస్తులు పోతున్న వారికి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. చిరు వ్యాపారుల కు ఉపాధి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు పూర్తిగా పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.