29 March, 2026 | 10:12 AM

అసంతృప్తులతో భయం భయం!

04-05-2024 12:54 AM

ఆదిలాబాద్ నేతలను పార్టీలో చేర్చుకుని.. వాయిదా వేసిన కాంగ్రెస్

వరంగల్ అభ్యర్థులపై ఇటు బీజేపీలో.. అటు కాంగ్రెస్‌లోనూ అసంతృప్తి

పార్టీలో చేరి టిక్కెట్లు తెచ్చుకున్నవారిపై శ్రేణుల్లో కినుక

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): అసంతృప్తి.. ఇప్పుడు అన్ని పార్టీలనూ.. ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులను వెంటాడుతున్న భయం. అందుకే అలాంటి అసంతృప్తిని.. సంతృప్తి పర్చడానికి అటు పార్టీ నేతలతోపాటు అభ్యర్థులు కూడా తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. పార్టీ మారడం నుంచి మొదలుకుని, టిక్కెట్లు తెచ్చుకోవడంతో మొదలైన అసంతృప్తి.. రోజు రోజుకూ ఉధృతంగా సాగుతున్న చేరికలతో బహిరంగం అవుతున్నాయి. దీనితో అటు పార్టీకి, ఇటు అభ్యర్థికికూడా జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అసంతృప్తులను తృప్తి పర్చేందుకు.. అంతిమంగా.. అసంతృప్త్యోస్మి అనేలా సంతృప్తి పర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

 కొద్ది రోజుల క్రితం పార్టీ నుంచి బహిష్కరించిన ఆదిలాబాద్ జిల్లా నేతలైన గండ్రత్ సుజాత, సాజిద్‌ఖాన్, సంజీవరెడ్డి తదితరులను తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకున్నారు. చేరికల కమిటీ నేత జగ్గారెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. అయితే ఆ జిల్లా నేతల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా తిరిగి చేర్చు కోవడాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది.

* వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి వరంగల్ లోక్‌సభ స్థానం పార్టీ టిక్కెట్టు అందుకున్న అరూరి రమేష్, అలాగే బీఆర్‌ఎస్ ఇచ్చిన టిక్కెట్టును కూడా కాదని కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యలపై సొంత పార్టీల్లోని శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని.. పార్టీమారి వచ్చినవారికి టిక్కెట్లు ఇవ్వడంపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లోనూ అంతర్గతంగా అంసతృప్తి పేరుకుపోయింది.

* బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసి..            

నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఇప్పుడు గులాబీ పార్టీలోనే అసంతృప్తి వెంటాడుతోంది. చివరి క్షణం వరకు టిక్కెట్టుకోసం పోరాడిన నేతలు తూతూ మంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిమిషంలో టిక్కెట్టు తెచ్చుకున్న మల్లు రవి, బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారి బీజేపీ టిక్కెట్టు తెచ్చుకున్న భరత్‌లపై ఆయా పార్టీల్లోనే అసంతృప్తి లోలోన మరుగుతోంది.

* జహీరాబాద్‌లో గంటల ముందే పార్టీ మారి టిక్కెట్టు తెచ్చుకున్న బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై, దశాబ్దకాలంగా స్థబ్దుగా ఉండి కాంగ్రెస్ టిక్కెట్టు తెచ్చుకున్న సురేష్ షెట్కార్‌పై శ్రేణుల్లో అసంతృప్తి కనపడుతోంది. 

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో అంతర్లీనంగా, లోలోపల అసంతృప్తి అనేది అన్ని పార్టీలనూ వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని పార్టీల్లోకి భారీగా జరుగుతున్న చేరికలనుకూడా అప్పటికే అక్కడ ఉన్న స్థానిక నేతలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆదిలాబాద్‌లో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వేటు వేసిన నేతలను లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే అక్కడ ఉన్న నేతలు దీనిని వ్యతిరేకిస్తూ.. ఏకంగా దిష్టిబొమ్మల దహనంకూడా చేశారు. దీనితో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ నిర్ణయాన్ని వాయిదావేయాల్సి వచ్చింది.

దీనితో ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని అంచనాకు వచ్చిన పార్టీల నేతలు ఆ అసంతప్తిని చల్లార్చేందుకు బుజ్జగింపులకు దిగుతున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న ద్వితీయ శ్రేణి నేతలను దగ్గరకు పిలుచుకుని మాట్లాడుతున్నారు. వారికి కావాల్సిన వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అసంతృప్తి ప్రభావాన్ని ఎన్నికల్లో కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నా... ఓటింగు నాటికి లోలోపల రగులుతున్న ఈ అసంతృప్తి ఎలాంటి పరిస్థితి సృష్టిస్తుందనే అనుమానం మాత్రం అటు పార్టీలకు, ఇటు అభ్యర్థులకు వెన్నంటి ఉంటుందనేది మాత్రం స్పష్టం. ఇక ఎప్పటికీ ఈ అసంతృప్తి.. అసంతృప్త్యోస్మి అవుతుందో వేచి చూడాల్సిందే.