కుళ్లిన ఎగ్ మంచూరియా డెలివరీ!
హోటళ్లలో ఫుడ్ నాణ్యత ఘోరం
మంచిర్యాలలో వెలుగు చూసిన బాగోతం
మంచిర్యాల, జూన్ 10 (విజయక్రాంతి): మంచిర్యాలకు చెందిన క్రాంతి పట్టణంలోని స్వాగత్ ప్రైడ్ రెస్టారెంట్ నుంచి ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాడు. డెలివరీబాయ్ ఆర్డర్ అందజేసిన తర్వాత పొట్లం తెరిచి చూస్తే దుర్వాసన వచ్చింది. కుళ్లిపోయిన ఎగ్ మంచూరియాను చూసి యువకుడు వెంటనే హోటల్‌కు వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. ‘అధికారులకు ఫిర్యాదు చేస్తే చేసుకోండి. ఎవరికైనా చెప్పుకోండి’ అంటూ బాధ్యతా రాహిత్యంగా సమాధానమిచ్చారు. ఇదీ సోమవారం మంచిర్యాలలో ఓ వినియోగదారుడికి ఎదురైన అనుభవం.
నాణ్యతను పక్కన పెట్టి సాధారణ ఫుడ్‌కు సైతం ఆన్‌లైన్‌లో ఎక్కువ ధర పెట్టి విక్రయిస్తున్నారు. ఇష్టారీతిన రంగులు వాడుతూ, వారాల తరబడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వచేస్తూ పబ్బం గడుపుకొంటున్నాయి. ప్రజారోగ్యాన్ని సంరక్షించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారు లు మిన్నకుంటుండటంతో హోటళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. మం చిర్యాల ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ వాసును వివరణ కోరగా.. నాణ్యతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాల వివరాలను తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.






