9 July, 2026 | 8:09 AM

చిన్నలిఫ్ట్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి

11-06-2024 12:50 AM

పెద్ద ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు.. తక్కువ ప్రయోజనం

తక్కువ ఖర్చుతో చిన్న ప్రాజెక్ట్‌లు.. ఎక్కువ లాభాలు 

నిర్వహణకు కాంట్రాక్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమిస్తాం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి): చిన్న లిఫ్టుల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి  అన్నారు. కోదాడలో సోమవారం హుజూర్‌నగర్, కోదాడ  నియోజకవ ర్గాల్లోని లిఫ్ట్‌ల నిర్వహణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావే శంలో ఆయన మాట్లాడారు. పెద్ద లిఫ్ట్‌ల నిర్మాణానికి రూ. కోట్లు  ఖర్చవుతాయని, వాటి వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. తక్కువ ఖర్చుతో చిన్న లిఫ్ట్‌లు నిర్మిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని స్పష్టంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా చిన్న లిఫ్ట్‌లపై ఆధారపడి ఆరు లక్షల ఆయకట్టు ఉందన్నారు. నీటి లభ్యత ఉన్న కొత్తగా లిఫ్ట్‌లు మంజూరు చేస్తామన్నారు. కొత్త లిఫ్టుల ఏర్పాటుకు భూ సేకరణ చేపడతామన్నారు. రెండు నియోజకవర్గాల పరిధి లోని నాగార్జున్‌సాగర్, కృష్ణా, మూసీపై మొత్తం 54 లిఫ్ట్‌లు ఉన్నాయని, వాటి నిర్వహణ గురించి గత ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించారు. దీంతో రైతులు నష్ట పోయారన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించి జూన్ 30 నాటికి మరమ్మతులు పూర్తి చేస్తుందన్నారు. లిఫ్ట్‌ల నిర్వహ ణకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఆఫరేటర్లు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వాచ్‌మెన్‌ను నియమిస్తామ న్నారు. నదులపైనే కాకుండా సాగర్ కాలువలపైనా లిఫ్ట్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

రైతులు ఇరిగేషన్‌శాఖ అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా చెరువులు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణకు గురైన చెరువులను గుర్తించి, వెంటనే సదరు భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూమి ఆక్రమించిన వారిపై కేసులు నమో దు చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకటరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, వివిద ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.