24-07-2025 12:00:00 AM
మిర్యాలగూడ, జూలై 23: నైట్ హాల్ట్ నిమిత్తం పార్క్ చేసిన మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్‌కు నిప్పు పెట్టిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు తడకమళ్లలో నైట్ హాల్ట్ నిమిత్తం ఉంచి సమీపంలో కండక్టర్, డ్రైవర్ నిద్ర పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు బస్‌కు నిప్పంటించి తగలబెట్టారు.
గుర్తించిన కండక్టర్, డ్రైవర్ ఫైర్ స్టేషన్‌తో పాటు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేయగా బస్సు పాక్షికంగా కాలిపోయింది. గ్రామానికి చెందిన వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మయ్య, ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆర్టీసీ ఆర్‌ఎం జాన్‌రెడ్డి, డీఎం రామ్మోహన్ పరిశీలించారు.