24-07-2025 12:00:00 AM
ఆలేరులో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్
ఆలేరు, జూలై 23 (విజయ క్రాంతి): ఆలేరులో విద్యార్థుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే పరిష్కరించాలని, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బందు పిలుపు సందర్భంగా, ఆలేరులో విద్యాసంస్థలను బహిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు మామిడాల ప్రవీణ్ మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో విద్యారంగాన్ని విచారణ సమస్యలను విస్మరించినట్టుగానే, రేవంత్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని, కనీసం విద్యాశాఖ కి మంత్రిని కూడా కేటాయించకుండా విద్యపై తమ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటున్నారని,
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, మరోవైపు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎంతో మంది పిల్లలు మరణిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్ సదుపాయాలు లేక విద్యార్థినిలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు విడుదల కాకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక చదువుని మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుందని,
ఇన్ని సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు ఓట్ల రాజకీయాలకు వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ రేపటి భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాల కోసం ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని, ఓట్లు వచ్చినప్పుడే రైతుబంధు రుణమాఫీలు అంటూ ఓటర్లకు గాలాలు వేస్తూ విద్యార్థులకు ఎలాగూ ఓట్లు లేవని వాళ్ళని గాలికి వదిలేసారని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని విద్యారంగంపై దృష్టి కేంద్రీకరించాలని, గురుకులాలన్నింటికీ సొంతభవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని,
ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ఎంఈఓ డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు ఆర్ ఉదయ్, మామిడాల మహేష్, కొమ్మిడి నరసింహ, అజయ్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.