04-11-2025 09:39:25 AM
							హైదరాబాద్: కరీంనగర్ జిల్లా(Karimnagar District) తిమ్మాపూర్ మండలం రాజీవ్ రహదరిపై రేణిగుంట వంతెన(Renigunta Bridge) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న మెట్ పల్లి డిపో నుండి టీజీఆర్టీసీ బస్సు వరి సంచులతో నిండిన ట్రాక్టర్ ను వెనుక నుండి ఢీకొట్టడంతో(RTC bus collides with tractor) ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సంచులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉండటంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.