ఆర్టీసీ స్పేర్ పార్ట్స్ ధరలకు కళ్లెం
- త్వరలో మరిన్ని విద్యుత్ బస్సులు
- ‘మహాలక్ష్మి’పై ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ప్రశంసలు
- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ స్పేర్ పాట్స్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్‌ఆర్టీ యూ) చైర్మన్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ వేదికగా ఏఎస్‌ఆర్టీయూ అఖిల భారత సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల ఆర్టీసీల చైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు), ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగ పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విపరీతంగా పెరుగుతున్న స్పేర్ పార్ట్స్ ధరలను ఎలా అధిగమించాలనే అంశంపై అసోసియేషన్ చైర్మన్ వై నాగిరెడ్డి కీలక సూచనలు చేశారు. పెరిగిపోతున్న ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, దేశవ్యాప్తంగా ఆర్టీసీలపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ టాప్‌లో ఉందని, త్వరలో మరిన్ని విద్యుత్‌బస్సులు వస్తాయన్నారు. దేశంలోనే మొదటిసారిగా కాలుష్య నివారణకు తెలంగాణలో విద్యుత్ బస్సులను విజయవంతంగా నడుపుతున్నట్లు వివరించారు. విద్యుత్ బస్సుల సమర్థవంతమైన నిర్వహణలో టీజీఎస్ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ అనుకూల విద్యుత్ బస్సులను తీసుకువచ్చి, హైదరాబాద్ నగరాన్ని పూర్తి కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా రవాణా రంగంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో టీజీఎస్ ఆర్టీసీ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా సంస్థకు గుండెకాయ లాంటి ఆర్టీసీ గ్యారేజీల నిర్వహణలో అధునాతన సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
వాహనాల ఫిట్నెస్, విడిభాగాల లభ్యత, మెయింటెనెన్స్ షెడ్యూళ్లను పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం ద్వారా బస్సుల సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణలో విజయవంతంగా అమలవు తున్న ‘మహాలక్ష్మి’ పథకాన్ని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు అభినందించినట్లు తెలి పారు. ఈ సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ వెంకన్న, రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్లు పాల్గొన్నారు.






