14-05-2025 12:00:00 AM
వరంగల్, మే 13 (విజయ క్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈనెల 15 నుండి 26 వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వరంగల్ రీజియన్ మేనేజర్ విజయభాను తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎనిమిది వందల బస్సులను వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి నడపనున్నట్లు తెలిపారు.
హనుమకొండ, వరంగల్ నుంచి వివిధ రకాల బస్సులను బట్టి పెద్దలకు 250 నుంచి 500, పిల్లలకు 140 నుంచి 380 చార్జీ ఉంటుందని తెలిపారు. అలాగే ఉప్పల్, హనుమకొండ, వరంగల్ బస్టాండ్ ల నుండి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు చెప్పారు. దీనితోపాటు జిల్లాలోని వివిధ డిపోల పరిధి నుంచి కాళేశ్వరం కు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు చెప్పారు.
ప్రత్యేకంగా గరుడ ఏసీ బస్సులు
సరస్వతీ పుష్కరాలకు ఉప్పల్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేకంగా రాజధాని, గరుడ, సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్ ఎం తెలిపారు. రాజధాని బస్సు చార్జీ 960, గరుడ బస్సు చార్జీ 1,130, సూపర్ లగ్జరీ చార్జీ 760 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం
సరస్వతీ పుష్కరాల కోసం నడిపే ఆర్టీసీ సర్వీసులో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి అనుమతి ఉందని రీజియన్ మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు.