నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న పాలకులు
- డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
హనుమకొండ,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ విమర్శించారు.శుక్రవారం హనుమకొండ, రాంనగర్ సుందరయ్య భవన్‌లో జరిగిన డీవైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ... కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. యువతకు ఆశలు చూపించి మోసం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ప్రకటించలేదని అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతోందని, చదువుకున్న యువత ఉద్యోగాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు యువత సమస్యలను పక్కన పెట్టి, వాగ్దానాలతో కాలం గడుపుతున్నాయని విమర్శించారు. యువత హక్కుల కోసం డీవైఎఫ్ఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు కొనసాగిస్తామని రమేష్ స్పష్టం చేశారు.






