29-09-2025 10:02:37 PM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదల అయినందున నిర్వహణలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రాజస్వ మండల అధికారులు, పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చినందున నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు, బందోబస్తు, అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రక్షణ ఏర్పాట్లు ఇతర ఎన్నికల అంశాలకు సంబంధించి అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఓటర్లను ప్రభావితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలని, మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలు ప్రతి జిల్లాలో రెండు విడతలలో నిర్వహించడం జరుగుతుందని, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ఎంపిక చేయబడిన జిల్లాలలో మూడు విడతలుగా, మిగతా జిల్లాలలో రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటీసు జారీ, ఓటర్ల జాబితా ప్రదర్శన, నామినేషన్ల దాఖలు, పరిశీలన, చెల్లుబాటయ్యే నామినేటెడ్ అభ్యర్థుల జాబితా, అప్పీలు, అప్పీళ్ల పరిష్కరణ, అభ్యర్థిత్వం ఉపసంహరణ, పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలింగ్ నిర్వహణ, రీపోల్ ఉన్నట్లయితే సంబంధిత ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, ప్రకటన ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర అదనపు డి.జి.పి. మహేష్ భగవత్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్ భద్రత, సి. సి. టివి పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్. పి. కాంతిలాల్ సుభాష్, అదనపు ఎస్.పి., జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ జాసిన్త్ జోల్, జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నిబంధనలను జిల్లాలో కచ్చితంగా అమలు చేసే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రక్షణ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామాగ్రి, అదనపు సామాగ్రి సమకూర్చడం, బందోబస్తు, ఇతర అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2 విడతలలో జెడ్ పి టి సి, ఎం పి టి సి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను అధికారుల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేస్తామని, పోలింగ్ కొరకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందం, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్, ఇతర ఎన్నికల సంబంధిత ఇబ్బంది నియామకం చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటి విడతలో 8 జెడ్ పి టి సి, 71 ఎం పి టి సి. స్థానాలకు, రెండవ విడతలో 7 జెడ్ పి టి సి, 56 ఎం పి టి సి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 5 మండలాలలో 114 గ్రామపంచాయతీలు, 944 వార్డులకు, రెండవ విడతలో 6 మండలాలలోని 113 గ్రామపంచాయతీలు, 992 వార్డులకు, మూడవ విడతలో 4 మండలాలలోని 108 గ్రామపంచాయతీలు, 938 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 15 మండలాలలో గల 335 గ్రామపంచాయతీలు, 2 వేల 874 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేస్తూ సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.