17 June, 2026 | 9:48 PM

జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు

17-06-2026 07:54 PM

బాకారం జాగీర్ గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్

మొయినాబాద్,(విజయ క్రాంతి): గ్రామీణ ప్రజలకు ప్రతి ఇంటికి కులాయి ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాకారం జాగీర్ గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం జాగీర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మిషన్ భగీరథ డీఈ హారిక, ఏఈలు వెంకటేశ్వర్లు, ప్రియదర్శిని, ఉప సర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి పథకం లక్ష్యాలు, ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు వ్యక్తికి 55 లీటర్ల నాణ్యమైన తాగునీటిని కులాయి కనెక్షన్ ద్వారా అందించడమేనని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ పథకం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోందని తెలిపారు. బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 700కు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయని, ప్రతి ఇంటికి తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుందని, నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మిషన్ భగీరథ అధికారులను కోరినట్లు తెలిపారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారని వెల్లడించారు.