సాగర్ ఆయకట్టు ఎండిన పాపం కేసీఆర్‌దే

24-04-2024 12:54:19 AM

l బస్సు యాత్ర కాదు, ఆయన మోకాళ్లపై నడిచినా ఫలితం శూన్యం

l ఇక బీఆర్‌ఎస్ శకం ముగిసింది.. కాంగ్రెస్ హవా కొనసాగుతుంది..

l బీజేపీ మత విద్వేషాలు రాజేసి ఓట్లు రాబట్టాలని చూస్తున్నది..

l రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో లాలూచీ పడి కృష్ణా జలాలను ఏపీకి వదిలివేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మిర్యాలగూడలో బస్సు యాత్ర నిర్వహిస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాళ్లపై నడిచి ఓట్లు అడిగినా ప్రజలు పట్టించుకోరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ శకం ముగిసి కాంగ్రెస్ హవా కొనసాగుతుందన్నారు.

బీజేపీ మత విద్వేషాలు రాజేసి ఓట్లు రాబట్టుకోవవాలని చూస్తున్నదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమినే అని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 13 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అందర్నీ కొలుపుకొంటూ పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 2019 నుంచి ఏనాడూ ఒకటో తేదీన జీతాలిచ్చిన దాఖలాలు లేవన్నారు. నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలు తనకు రెండు కళ్లు లాంటివన్నారు. నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి మూడు నెలలోనే రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు.

నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీఐల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామన్నారు. నల్లగొండలోని గడియారం సెంటర్‌లో నీలగిరి నిలయం అర్కిటెక్ పనులు తుదిదశకు వచ్చాయన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేయనున్నారని, ర్యాలీకి కార్యకర్తలు భారీగా విచ్చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాశం వెంకటరెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.