07-12-2025 12:12:07 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాదేమోననే బెంగతో ప్రాణాలర్పించిన సాయి ఈశ్వర్ ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి అది ప్రభుత్వ హత్య నేనని బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత పాయల్ శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పేరుతో చేస్తున్న మోసాన్ని రాష్ట్రంలోని బీసీ లందరూ గమనించాలన్నారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఊగిసలాడిన మాదిరిగానే బీసీల రిజర్వేషన్ ల విషయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం అదే తీరు అవలంబిస్తుందని మండిపడ్డారు.42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ప్రభుత్వం నాటకాలు ఆడిందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా, ఉన్న రిజర్వేషన్లు తగ్గించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం బీసీలను మోసం చేయడమేనన్నారు.
ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్రంలో బీసీల మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో బీసీలు పోరాటాలు, త్యాగాలలో ముందుండి ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
మళ్లీ ఇప్పుడు రిజర్వేషన్ల కోసం బీసీలు ఆత్మ బలిదానాలు చేసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలాన్ని ఇవ్వాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు దినేష్ మాటోలియా, లాలా మున్నా, ఘటిక క్రాంతి, రఘుపతి, భీమ్‌సేన్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.