27 May, 2026 | 2:13 AM

ఒకటో తారీఖునే జీతాలు

27-05-2026 01:09 AM
  1. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి చెల్లించాలి
  2. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే పంచాయతీ సిబ్బందికి అందాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేస్తామని చెప్పారు.  అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమన్నారు.  స్వంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, సీపీసీ సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని చెప్పారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి , పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.